
నందినీ రెడ్డి దర్శకత్వంలో ఇటీవల థియేటర్లలో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ ఫ్యామిలీ డ్రామా సినిమా బాగానే ఉంది కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు చాలా మంది దర్శకనిర్మాతలు తమ సినిమాలలో అంతా సత్తా ఉందా లేదా అని చూసుకోకుండా 5 భాషలలో పాన్ ఇండియా మూవీలుగా తీసేస్తున్నారు. కనుక డబ్బాలు వెంటనే తిరిగివచ్చేస్తున్నాయి. ఈ సినిమాని కూడా 5 భాషలలో తీసి వదిలారు. కానీ పెద్దగా ఆడలేదు.
సినిమాలు బాగా ఆడినా ఆడకపోయినా ఏదో ఓ రోజు ఓటీటీలోకి రావలసిందే కనుక ఇది కూడా ఈ నెల 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ సంస్థ స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేసింది.
ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, సంతోష్ శోభన్, మాళవిక నాయర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఓ కాఫీ ఎస్టేట్ గురించి రెండు కుటుంబాల మద్య న్యాయ వివాదం కొనసాగుతుంటే, వారికి పుట్టిన మనమలు ఆసుపత్రిలో తారుమారవుతారు. వారు పెరిగి పెద్దవారై ప్రేమించుకొంటారు. మద్యలో విభేధాలు వచ్చి విడిపోతారు. తర్వాత మళ్ళీ కలుస్తారు. పెళ్ళి పీటలు ఎక్కుతారు. వారి జన్మ రహస్యం బయటపడటం, కధ సుఖాంతం అవడం.
భారతీయ ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు కొత్తేమీ కాదు. దశాబ్ధాలుగా చూస్తూనే ఉన్నారు. కనుక వారిని ఆకట్టుకొనేలా కధ చెపుతూ కుర్చీలో కూర్చోపెట్టగలిగితే ‘అల వైకుంటపురములో’ అవుతుంది లేకుంటే అన్నీ అపశకునాలే ఎదురవుతాయి.