
తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్తకొత్త హీరోయిన్లు దిగుతూనే ఉంటారు. వారిలో కొంతమందికే అదృష్టం కలిసి వచ్చి హీరోయిన్లుగా నిలద్రొక్కుకొంటారు.అటువంటి అందాలభామే శ్రీలీల. ఆమె 2021 ‘పెళ్ళి సందD’తో టాలీవుడ్లో అడుగుపెట్టింది.
2022లో రవితేజతో ధమాకాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొంది. అప్పటి నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మహేష్ బాబుతో గుంటూరు కారంలో మరదలుగా నటిస్తోంది. పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్, బాలకృష్ణ కూతురుగా భగవంత్ కేసరి సినిమాలలో నటిస్తోంది.
ఇంకా విజయ్ దేవరకొండ హీరోతో ఓ సినిమా, వైష్ణవ్ తేజాతో ఆదికేశవ, అనగనగా ఒకరోజు, బోయపాటి-రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలలో ఆమె అవకాశాలు చేజిక్కించుకొంది. ఆమె వరుసపెట్టి ఇందరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండటం గమనిస్తే, కేవలం రెండేళ్లలో ఆమె కెరీర్ పీక్ చేరుకొందని అర్దమవుతోంది. కనుక శ్రీలీల చాలా మంది హీరోయిన్ల కంటే అదృష్టవంతురాలే అనుకోవచ్చు.
ఈరోజు ఆమె పుట్టిన రోజు. కనుక ఆమె నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా పోస్టర్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్టర్, ఆదికేశవ సినిమా పోస్టర్ విడుదల చేసి ఆయా సినీ నిర్మాణ సంస్థలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి.