ఆదిపురుష్‌ టికెట్‌ ధరల పెంపుకి గ్రీన్ సిగ్నల్‌

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించిన ఆదిపురుష్‌ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇది చాలా భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా కనుక మొదటివారంలో టికెట్‌ ఛార్జీలు పెంచుకొనేందుకు అనుమతించాలని కోరుతూ ఆదిపురుష్‌ నిర్మాతలు దరఖాస్తు చేసుకోగా, రెండు తెలుగు రాష్ట్రాలు దానికి ఆమోదం తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీని కోసం జీవో జారీ చేయగా, ఏపీ ప్రభుత్వం నేడు జారీ చేయవచ్చు. 

తెలంగాణలో జూన్ 16 నుంచి మొదటి మూడు రోజులు మాత్రమే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌ ధరను రూ.50 పెంచుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అలాగే థియేటర్లలో తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక షోలు వేసుకొనేందుకు అనుమతించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్టంగా టికెట్‌ ధర రూ.175 ఉంది. మరో రూ.50 పెరిగితే ప్రేక్షకులు రూ. 225 చెల్లించాల్సి ఉంటుంది. 3డీలో చూడాలనుకొనేవారు 3డీ కళ్ళద్దాల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఏపీలో కూడా రూ.50 పెంచుకొనేందుకు అనుమతించిన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఆదిపురుష్‌ బుకింగ్స్ మొదలైపోయాయి. అక్కడ గురువారమే విడుదలవుతుంది కనుక ఆదిపురుష్‌ అంచనాలను అందుకొంటుందా లేదా రేపే తెలుస్తుంది.