వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధం జరిగిందహో

నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రముఖ నటి లావణ్య త్రిపాఠిల వివాహ నిశ్చితార్ధం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో నాగబాబు ఇంట్లో ఇరుకుటుంబాలు, వారి అత్యంత సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో జరిగింది.

ఈరోజు వారి వివాహ నిశ్చితార్ధం జరుగబోతున్నట్లు మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయే తప్ప మెగా ఫ్యామిలీలో ఎవరూ కూడా ధృవీకరించలేదు. కనీసం ఈ కార్యక్రమం గురించి మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

అయితే మీడియాలో వార్తలు నిజమని ధృవీకరిస్తూ నేడు వారి వివాహ నిశ్చితార్ధం జరిగింది. కనీసం ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ వారి పెళ్ళి ముచ్చట్లు చెపితే అభిమానులు సంతోషిస్తారు కదా? వారి వివాహం ఈ ఏడాది డిసెంబర్‌లోగా జరుగబోతున్నట్లు తెలుస్తోంది. 

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి 2017లో ‘మిస్టర్’ ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలలో కలిసి నటించారు. అప్పటి నుంచే వారి మద్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. ఇన్నేళ్ల తర్వాత ఇద్దరూ పెళ్ళి పీటలు ఎక్కబోతునందుకు మెగా అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవదారి అర్జున’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. అది ఈ ఏడాది ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. దాని తర్వాత శక్తి ప్రతాప్ సింగ్‌ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ, దాని తర్వాత కరణ్ కుమార్‌ దర్శకత్వమో మరో సినిమా చేయబోతున్నాడు.

లావణ్య త్రిపాఠి ఇటీవల పులి మేక అనే పోలీస్ క్రైమ్ స్టోరీతో తెలుగులో ఓ వెబ్‌ సిరీస్‌లో నటించి మెప్పించింది. దాని తర్వాత అధర్వ హీరోగా తమిళంలో ఓ సినిమా చేస్తోంది. తెలుగులో ఓ సినిమా, ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేయబోతోంది.