బ్రో... మరో సినిమా చేద్దామా?

ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ ‘బ్రో’ అనే ఓ సినిమా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీని కూడా చూసుకొంటూ అటు రాజకీయాలలో కూడా యాక్టివ్‌గా ఉండాలి కనుక ఈ సినిమాలో తన పాత్రని కేవలం 29 రోజులలో పూర్తి చేసేశారు. ఆ తర్వాత సముద్రఖని మిగిలినవారితో ఆ సినిమా షూటింగ్‌ శరవేగంగా పూర్తి చేసి జూలై 28న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించేశారు కూడా. అదే సమయంలో ఆయన ప్రధానపాత్రలో ‘విమానం’ అనే మరో సినిమాని కూడా పూర్తి చేసేశారు. అది నేడే విడుదలవుతోంది. 

సముద్రఖని ఇంత వేగంగా సినిమాలు పూర్తిచేస్తుండటంతో పవన్‌ కళ్యాణ్‌ ఆయనతో మరో సినిమా చేయాలనుకొన్నట్లు తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదాయ సితం’ సినిమాకు‘బ్రో’ తెలుగు రీమేక్. కనుక ఈసారి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేద్దామని పవన్‌ కళ్యాణ్‌ కోరిన్నట్లు తెలుస్తోంది. 

ఇక బ్రో సినిమాలో సాయిధరం తేజ్ ‘మార్కండేయులు’ అనే ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. పురాణాలలో మార్కండేయులు అనే బాల భక్తుడి ప్రాణాలను యముడి హరిస్తే, పరమశివుడు తిరిగి బ్రతికించిన్నట్లు చెపుతున్నాయి కనుక ఈ సినిమాలో ఆ పేరుతో నటిస్తున్న సాయి ధరం తేజ్ కూడా అలాగే చనిపోతే కాలచక్రం (దేవుడు)గా నటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ సాయంతో తిరిగి బ్రతికివస్తాడని అర్దమవుతోంది.

పవన్‌ కళ్యాణ్‌-సాయి ధరం తేజ్ కాంబినేషన్‌ అంటే మంచి కామెడీ ఉంటుందని భావించవచ్చు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్‌ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో ఆ కామెడీ మరింత బాగా పండుతుంది. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్‌ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. జూలై 28న బ్రో వస్తున్నాడు.