
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దీనిపై చాలా భారీ అంచనాలు ఉన్నందున అభిమానులు, సాధారణ ప్రేక్షకులు, రామభక్తులు ఈ సినిమా చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలలో ఒకరైన అభిషేక్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా ఓ ముఖ్య ప్రకటన చేశారు.
“ఈ జూన్ నెలలో వస్తున్న ఓ గొప్ప వ్యక్తి వస్తున్నాడు. మర్యాద పురుషోత్తముడు రాకను పండుగలా జరుపుకొందాం. ఆదిపురుష్‌ని స్వాగతిద్దాం. ప్రభు శ్రీరాముడి జీవిత చరిత్రలో ప్రతీ అధ్యాయం మానవజాతికి ఓ గొప్ప పాఠం వంటిదే. భవిష్యత్ తరాలకు కూడా ఆ మహనీయుడి గురించి తెలుసుకొని ఆయన అడుగు జాడలలో నడవాలి. అందరం ఓ గొప్ప అనుభూతిలో మునిగి తేలుదాం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొంటున్న పిల్లలకు, అనాధాశ్రమాలలో పిల్లలకు, వృద్ధాశ్రమాలలో ఉంటున్న వృద్ధులకు పదివేల టికెట్లు ఉచితం పంపిణీ చేయాలని నిర్ణయించాము. గూగుల్ ఫామ్‌లో మీ వివరాలను నింపి, మీ పేర్లు నమోదు చేసుకొంటే చాలు ఆదిపురుష్ సినిమా టికెట్స్ మీ చేతికి అందిస్తాం అని ప్రకటించారు. ఈ ఉచిత టికెట్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 95050 34567 లేదా ఈమెయిల్: info@agarwalarts.com.
శ్రీరామ నామస్మరణ జరిగే చోట హనుమంతుడు తప్పక ఉంటాడనే హిందువుల నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ సినిమా ప్రదర్శించబడే అన్ని సినిమా థియేటర్లలో హనుమంతుడు కోసం ఒక సీటు ఖాళీగా విడిచిపెట్టబోతున్నట్లు అభిషేక్ అగర్వాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.