జూన్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో కస్టడీ

నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన కస్టడీ సినిమా మే 12న థియేటర్లలో విడుదలైంది. కోలీవుడ్‌ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాపై నాగ చైతన్య చాలా ఆశలు పెట్టుకొన్నాడు. కానీ మిశ్రమ స్పందన రావడం తీవ్ర నిరాశ కలిగించింది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాటి తదుపరి గమ్యం ఓటీటీలే కనుక కస్టడీ కూడా ఓటీటీలో విడుదలకు సిద్దం అవుతోంది. ఈ నెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ఈ సినిమా ప్రారం కాబోతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఒకేసారి విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్‌ వెల్లడించింది. 

ఈ సినిమాకు కస్టడీ అనే పేరు చక్కగా సరిపోతుంది. నిజాయితీగల పోలీస్ కానిస్టేబుల్‌ శివ (నాగ చైతన్య) కారాదు గట్టిన నేరస్థుడైన రాజు (అరవింద్ స్వామి)ని సీబీఐ అధికారి జార్జ్ (సంపత్ రాజ్‌)లను డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్‌ చేసి లాకప్‌లో పెడతాడు. అప్పుడు ముఖ్యమంత్రి దాక్షాయణి (ప్రియమణి) ఆదేశం మేరకు పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్‌) లాకప్‌లో ఉన్న రాజును చంపేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు శివ రక్షించి బెంగళూరుకు తరలిస్తాడు. రాజుని హత్య చేయమని ముఖ్యమంత్రి ఎందుకు ఆదేశించింది? కమీషనర్ నుంచి రాజుని శివ ఎందుకు, ఏవిదంగా కాపాడాడు? చివరికి ఏం జరిగిందనేదే ఈ కధ.