లలితా జ్యూయలరీస్ దోపిడీ కధాంశంతో కార్తీ సినిమా జపాన్‌

2019లో చెన్నైలోని లలితా జ్యూవెలరీ దుకాణంలో రూ.13 కోట్లు విలువైన బంగారు నగలు దొంగతనం అయ్యాయి. వాటిని తిరువారూర్ ముర్గన్ అనే వ్యక్తి దొంగిలించి తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. దొంగతనం కేసులో జైలుకి వెళ్ళిన అతను 2020లో జైలులోనే ఎయిడ్స్ వ్యాధితో మరణించాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దోపిడీని కధాంశంగా తీసుకొని రాజు మురుగన్ దర్శకత్వంలో తెర కెక్కిస్తున్న సినిమా పేరే ‘జపాన్’. 

ఈ సినిమాలో కార్తీ, అను ఇమ్మాన్యుయెల్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో లలితా జ్యూవెలరీ దుకాణంలో నగలు దొంగతనం చేసిన తిరువారూర్ మురుగన్‌గా కార్తీ నటిస్తున్నాడు. సునీల్, విజయ్‌ మిల్టన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు కలిసి నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతంఎల్ జీవి ప్రకాష్ కుమార్, కెమెరా: ఎస్.రవి వర్మన్, స్టంట్స్: ఏఎన్ఎల్ అరుసు చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి పండుగకు విడుదల కాబోతోంది. ఇటీవలే విడుదలైన టీజర్‌లో కార్తీ వేషధారణ, ‘జపాన్ మేడ్ ఇన్‌ ఇండియా’ అంటూ డైలాగ్ చెప్పిన తీరు చాలా ఆకట్టుకొంటోంది.