కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు పవన్‌ కళ్యాణ్‌ గురించేగా?

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు వృద్ధాప్యం కారణంగా సినిమాలలో నటించడం మానుకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సినీ నటులు, సినీ పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “ఈరోజులో సినిమాలని సినిమాలని అనలేము. ఎందుకంటే ఆవిప్పుడు సర్కస్‌ల్లా మారిపోయాయి. 

ఒకప్పుడు ఎన్టీఆర్‌, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటివారు సినిమాలు చూసి ప్రజలు వారి నటనను మాత్రమే చూసి మెచ్చుకొనేవారు తప్ప వారి వయసు గురించి ఆలోచించేవారు కారు. వారు కూడా ఏనాడూ తమకి ఎంత పారితోషికం లభిస్తోందనే విషయం ఎవరితో చెప్పేవారు కారు. కానీ ఇవాళ్ళ కొందరు నటులు బహిరంగసభలలో మైకు పట్టుకొని నేను రోజుకి రెండు కోట్లు పారితోషికం తీసుకొంటానని, మరొకరు నాకు రోజుకి ఆరు కోట్లు తీసుకొంటానని గొప్పగా చెప్పుకొంటారు. ఒక్కో సినిమాకి కనీసం రూ.50 కోట్లు వరకు తీసుకొంటామని గర్వంగా చెప్పుకొంటారు. ఈవిదంగా చెప్పుకోవడం మంచిది కాదు. 

నటీనటులు తమ నటనతో ప్రజలను మెప్పించాలి కానీ తాము తీసుకొనే పారితోషికాలతో కాదు. ఇండస్ట్రీలో పెద్దవారిని గౌరవించే అలవాటు తగ్గింది అలాగే ప్రేక్షకులు కూడా చులకనగా మాట్లాడుతున్నారు. మన నటీనటులను మనమే అవమానించుకోవడం, అవహేళన చేయడం సబబు కాదు,” అని అన్నారు. 

ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ జనసేన సభలో మాట్లాడుతూ, “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లాగా నాకు అక్రమాదాయాలు లేవు. కనుక నేను నా పార్టీని నడిపించుకోవడానికే సినిమాలు చేస్తున్నాను. నేను ఒక రోజుకి రెండు కోట్లు చొప్పున 25 రోజులు పనిచేస్తే రూ. 50 కోట్లు సంపాదించుకొంటాను దానినే పార్టీ కోసం ఖర్చు చేస్తున్నాను,” అని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన ఆ మాటలపైనే కోటా శ్రీనివాసరావు స్పందించిన్నట్లు అర్దమవుతోంది.