తిరుపతిలో ఆదిపురుష్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడంటే...

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్‌, కృతి సనన్ సీతారాములుగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా జూన్ 16వ తేదీన విడుదల కాబోతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 6వ తేదీన తిరుపతిలో నిర్వహించబోతున్నట్లు ఈ సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియెషన్స్ కొద్ది సేపటి క్రితం సోషల్ మీడియాలో ప్రకటించింది. 

తిరుపతిలో శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి ప్రీరిలీజ్ ఈవెంట్‌ నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ సినిమా సంగీత దర్శకుడు అతుల్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబై నుంచి మోటార్ బైక్‌పై బయలుదేరుతున్నారని తెలియజేసింది. 

ఈ కార్యక్రమానికి ప్రభాస్‌, కృతి సనన్‌, రావణ పాత్రలో నటించిన సైఫ్ ఆలీఖాన్, హనుమంతుడిగా నటించిన దేవదత్త నాగే, లక్ష్మణుడిగా నటించిన సన్నీ సింగ్‌ని తదితరులు కూడా హాజరుకాబోతున్నారు. 

బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ సినిమాలతో భారతీయ సినిమాలు యావత్ ప్రపంచదేశాల దృష్టి ఆకర్షించడంతో, రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఆదిపురుష్‌ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా భారతీయులతో పాటు హాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది. రామాయణంలో అనువణువునా భక్తిరసం పొంగుతుంటుంది. అయితే ఓం రౌత్ ఈ సినిమాలో భక్తిరసం కంటే యుద్ధకాండకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన్నట్లు పోస్టర్స్, టీజర్‌లు చెపుతున్నాయి. ఆ యాక్షన్ సీన్స్ మరింత అద్భుతంగా చూపేందుకే ఈ సినిమాను 3డీ విడుదల చేస్తున్నట్లు భావించవచ్చు. 

ఆదిపురుష్‌ సినిమాను భూషణ్ కుమార్, కృషన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై నిర్మించారు.