హరిహరవీరమల్లు... మళ్ళీ షురూ

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హరిహరవీరమల్లు సినిమాని 2020లో మొదలుపెట్టారు. కానీ ఇంతవరకు అది పూర్తికాలేదు. దాని తర్వాత చేసిన భీమ్లా నాయక్ 2022లో విడుదలైంది. దాని తర్వాత సముద్రఖని దర్శకత్వంలో చేసిన ‘బ్రో’ సినిమా జూలై 23న విడుదల కాబోతోంది. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌, సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాల షూటింగ్‌ శరవేగంగా సాగుతున్నాయి. కానీ వీటన్నిటి కంటే ముందుగా మొదలుపెట్టిన హరిహరవీరమల్లు మాత్రం ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో తెలీని పరిస్థితి.

ఓ వైపు సినిమాలు, మరోవైపు జనసేన రాజకీయాల కారణంగా పవన్‌ కళ్యాణ్‌కి సమయం సరిపోవడం లేదు. త్వరలో తెలంగాణ తర్వాత ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ముందుగా తెలంగాణ ఎన్నికల గంట మోగుతుంది. అప్పటి నుంచి పవన్‌ కళ్యాణ్‌ ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అంటే ఈ ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ వరకు సినిమాలు చేయలేకపోవచ్చు. కనుక ఆలోగా వీలైనన్ని సినిమాలు పూర్తిచేసేందుకు పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారు. 

హరిహరవీరమల్లుని కూడా పూర్తి చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ డేట్స్ ఇవ్వడంతో దర్శకుడు క్రిష్ హైదరాబాద్‌, రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి షూటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ మొదటివారంలో షూటింగ్‌ ప్రారంభించి ఏకధాటిగా 10 రోజులపాటు పవన్‌ కళ్యాణ్‌ పాత్రకు సంబందించిన సన్నివేశాలను పూర్తిచేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిలో కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. 

పీరియాడికల్ మూవీగా తీస్తున్న హరిహర వీరమల్లు 17వ శతాబ్దంలో మొగలుల కాలంలో తిరుగుబాటు యోధుడుగా పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్నారు. రూ.150-200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తీస్తున్నారు. మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.   

హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ పవన్‌ కళ్యాణ్‌ జంటగా నటిస్తోంది. బాలీవుడ్‌ నటులు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా 2023, మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉంది.