ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడుగా నటిస్తున్న ప్రభాస్‌కు హిందీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ శరత్ కేల్కర్ డబ్బింగ్ చెపుతున్నారు. ఇటీవలే ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన శరత్ కేల్కర్ దాని గురించి తన అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించారు. ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పే క్రమంలో నేను సినిమా అంతా చూశాను. ఈ సినిమా మహాద్భుతంగా ఉంది. సినిమాకు ఇంకా తుదిమెరుగులు దిద్దుతున్నారు. అవి కూడా పూర్తయితే ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అంత మహాద్భుతంగా ఉంది ఆదిపురుష్.
ఈ సినిమాకి తీసుకొన్న కధ, దానిని తెరకెక్కించిన విధానం రెండూ అద్భుతంగా ఉన్నాయి. ఆదిపురుష్‌లో డబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత నేను ప్రభాస్‌ను కలిసి అభినందించకుండా ఉండలేకపోయాను. సినిమాలో ఆయన అద్భుతంగా నటించారు. ఆయన నన్ను చూడగానే ఆప్యాయంగా కౌగలించుకొని, చాలా బాగా డబ్బింగ్ చెప్పావని మెచ్చుకొన్నారు. ఇంత కంటే గొప్ప ప్రశంశ ఏముంటుంది?
ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినప్పటికీ అందరితో ఎంతో మర్యాదగా, గౌరవంగా, సెట్స్‌లో చాలా హుందాగా నిరాడంబరంగా ఉంటారు. ఆయన తీరు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను,” అని శరత్ కేల్కర్ ప్రభాస్ గురించి ప్రశంశల వర్షం కురిపించారు. ఆదిపురుష్‌లో టీజర్ చూసి దిగులు పడి ఉన్న ప్రభాస్ అభిమానులకు శరత్ కేల్కర్ చెప్పిన ఈ చల్లటిమాట తప్పక చాలా సంతోషం కలిగిస్తుంది.
ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. భూషణ్ కుమార్, కృషన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.