అక్కినేని హీరోలు నాగార్జున, ఆయన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని ముగ్గురికీ గత కొంతకాలం గ్రహాలు అనుకూలిస్తున్నట్లు లేవు. ముగ్గురూ వరుసపెట్టి ఎన్ని సినిమాలు చేస్తున్నా అన్నీ ఫ్లాప్ అవుతున్నాయే తప్ప ఒక్కరూ ఓ హిట్ కొట్టలేకపోతున్నారు.
నాగార్జున 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘ఊపిరి’ రెండు హిట్స్ కొట్టారు. ఆ తర్వాత రాజుగారి గది-2, దేవదాస్, ఆఫీసర్, మన్మధుడు-2, బంగ్గారాజు అన్నీ కూడా బాక్సాఫీసు వద్ద బోర్లా పడ్డాయి. అంటే దాదాపు ఏడేళ్ళుగా ఒక్క హిట్ కూడా లేదన్నమాట!
నాగ చైతన్య విషయానికి వస్తే, ఇంకా దారుణంగా ఉంది. 2013లో మనం సినిమా తర్వాత ఒక్క సరైన హిట్ పడలేదు. సమంతతో మనస్పర్ధాలు, తర్వాత విడాకులు తీసుకోవడంతో నాగ చైతన్య వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తాజాగా విడుదలైన కస్టడీ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఆడుతోంది. నాగ చైతన్య కధల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకొంటూ, రకరకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ హిట్ పడటం లేదు. కస్టడీ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.19.63 కోట్లు రాబట్టాల్సి ఉందని కానీ సినిమా పరిస్థితి చూస్తుంటే అంతవరకు లాగేలా లేదని ట్రేడ్ పండిట్స్ చెపుతున్నారు.
అఖిల్ అక్కినేని పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1995లో విడుదలైన సిసింద్రీతో బాలనటుడిగా సినీ పరిశ్రమలో మంచి పేరు, అక్కినేని కుటుంబం అండదండలు ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్క హిట్ కొట్టలేకపోయాడు. 2014 నుంచి నేటి వరకు 6 సినిమాలు చేయగా తాజా చిత్రం ఏజంట్తో సహా ఆరూ ఫ్లాప్ అవడం చాలా బాధాకరమే. అయితే ముగ్గురు అక్కినేని హీరోల ప్రయత్నలోపం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. బహుశః వారి గ్రహస్థితి బాగున్నట్లు లేదు. కనుక కొంతకాలం ముగ్గురూ ఓపిక పట్టక తప్పదు.