మహేష్-త్రివిక్రం మూవీ టైటిల్‌ గుంటూరు కారం?

ఎస్ఎస్ఎంబీ28 వర్కింగ్ టైటిల్‌తో మహేష్ బాబు- త్రివిక్రం శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో సిద్దమవుతున్న సినిమాకు ఇదే టైటిల్‌ అంటూ ఇప్పటికే ఓ నాలుగైదు పేర్లు వినిపించాయి. వాటిలో అమరావతి అటు ఇటు, అయోధ్యలో అర్జునుడు, ఊరికి మొనగాడు వంటివి వినిపించినా అవన్నీ చాలా పాతరకం టైటిల్స్ అని పక్కన పెట్టేశారని, ‘గుంటూరు కారం’ టైటిల్ ఫైనల్ చేసేశారని తాజా సమాచారం. ఈ నెల 31న దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఎస్ఎస్ఎంబీ28 సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. కనుక ఈ ‘గుంటూరు కారం’ అసలైనదా కాదా అనేది ఆరోజే తెలుస్తుంది. 

మహేష్-త్రివిక్రం కలిసి ఖలేజా, అతడు సినిమాలు చేశారు. అవి వారి స్థాయికి తగిన్నట్లు లేనప్పటికీ సినిమాలు బాగుండటం బాగానే ఆడాయి. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత వారిద్దరూ కలిసి చేస్తున్నారు కనుక ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల నటిస్తోంది. దీనిని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు.