ఆదిపురుష్‌ మరో పోస్టర్‌...

ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక ఆ చిత్ర బృందం మెల్లగా ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఆదిపురుషుడి దివ్యశక్తిని ఆస్వాదించండి అంటూ నేడు ట్విట్టర్‌లో మరో పోస్టర్‌ విడుదల చేశారు. దానిలో హనుమంతుడు గాలిలో ఎగురుతున్నట్లు చూపిస్తూ వెనుక శ్రీరాముడు శత్రుసైన్యం మీదకి బాణం సందిస్తున్నట్లు చూపారు. పోస్టర్‌ అద్భుతంగానే ఉంది. టీజర్‌, పాత్రదారుల వేషధారణపై వచ్చిన విమర్శలతో వెనక్కుతగ్గిన సినీ బృందం, ట్రైలర్‌ విషయంలో మళ్ళీ విమర్శలు తలెత్తే అవకాశం లేకుండా చక్కగా రూపొందించి విడుదల చేశారు. దానిలో కూడా పాత్రదారుల వేషధారణ మారనప్పటికీ ట్రైలర్‌ చక్కగా తీయడంతో ప్రజలు వేషధారణను పట్టించుకోలేదు. దాంతో ఆదిపురుష్‌ ట్రైలర్‌కు అపూర్వ స్పందన వచ్చింది. 

ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మాతలు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు.