లైగర్ డిస్ట్రిబ్యూటర్లు ఫిలిమ్ ఛాంబర్ వద్ద రిలే నిరాహార దీక్ష!

దర్శకుడు పూరీ జగన్నాద్‌ను లైగర్ సినిమా ఇంకా భూతంలా వెంటాడుతూనే ఉంది. పాన్ ఇండియా మూవీగా విడుదల చేసిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలవడంతో పూరీ జగన్నాథ్ ఎవరికీ మొహం చూపించలేకపోతున్నారు. దానికి తోడు ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాన్ని భర్తీ చేయాలని ఆయన వెంటపడుతూనే ఉన్నారు. 

 నైజాం ఏరియా లైగర్ డిస్ట్రిబ్యూటర్లు శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఫిలిమ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టారు. లైగర్ విడుదలైన తర్వాత తాము పూరీని కలిసి తమకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరితే, ఆరు నెలలు గడువు అడిగారని, కానీ నేటికీ ఒక్కరికీ ఒక్క రూపాయి చెల్లించకపోగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఖాళీ చేసి వెళ్లిపోయారని డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము డబ్బు కోసం పూరీ జగన్నాద్‌కు ఫోన్‌లు చేస్తుంటే కాల్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. పూరీ జగన్నాథ్ తమకు నష్టపరిహారం చెల్లించేవరకు ఫిలిమ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని నైజాం ఏరియా లైగర్ డిస్ట్రిబ్యూటర్లు తేల్చి చెప్పారు.