ఉస్తాద్ భగత్ సింగ్‌ కేరాఫ్ మహంకాళీ పోలీస్ స్టేషన్‌

హరీష్ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌, శ్రీలీల జంటగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది.

ధర్మం నశించినచోట అధర్మాన్ని అణచివేసేందుకు తాను అవతరిస్తాననే శ్రీకృష్ణపరమాత భగవత్గీతలోని శ్లోకం వినిపించిన తర్వాత, 'భగత్... ' అంటూ టీగ్లాసుని చేత్తో పట్టుకొని లుంగీ కట్టుకొని పోలీస్ జీపులో నుంచి పవన్‌ కళ్యాణ్‌ బయటకు వస్తాడు. ఆ తర్వాత 'మహంకాళీ పోలీస్ స్టేషన్‌, పత్తర్ గంజ్, పాతబస్తీ...' అంటూ తన కేరాఫ్ అడ్రస్ వినిపిస్తూ, స్టైలుగా పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశిస్తాడు.

తర్వాత సీన్లో పవన్‌ కళ్యాణ్‌ పోలీస్ యూనిఫారంలో స్టేషన్లో కొంచెం హడావుడి చేసిన తర్వాత స్టైల్‌గా కుర్చీలో కూర్చొని టీ తాగుతూ, “ఈసారి పెర్ఫార్మేన్స్ బద్దలైపోద్ది...” అంటూ చెప్పిన డైలాగ్ అభిమానులకు పండగే.

ఇదివరకు విడుదల చేసిన ఫస్ట్-లుక్‌ పోస్టర్‌లో “ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు...” అంటూ అంతకు మించి చాలా ఉందని దర్శకుడు హరీష్ శంకర్‌ ముందే చెప్పేశాడు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా అదే చెపుతున్నాడు. కనుక ఇది వారి గబ్బర్ సింగ్‌ సినిమాకి మించే ఉండొచ్చు.  

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ. రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అయనంకా బోస్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.