పవన్‌ కళ్యాణ్‌... ఇదేం పద్దతి? పూనమ్ కౌర్

ఒకప్పటి నటి పూనమ్ కౌర్ అప్పుడప్పుడు పవన్‌ కళ్యాణ్‌ లేదా త్రివిక్రం శ్రీనివాస్‌లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తుంటుంది. కనుక వారి అభిమానులు కూడా ఆమెతో యుద్ధం చేయడానికి ఎల్లప్పుడూ సిద్దంగానే ఉంటారు. తాజాగా ఆమె ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా పోస్టర్‌పై స్పందిస్తూ, “మనం స్వాతంత్ర సమరయోధులను గౌరవించకపోయిన పర్వాలేదు కానీ వారి పట్ల అవమానకరంగా వ్యవహరించకూడదు. ఓ సినిమా తాజా పోస్టరులో భగత్ సింగ్‌ పేరును హీరో కాలికింద చూపారు. దీనిని అహంభావం అనుకోవాలా అవివేకమనుకోవాలా?” అని పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.  

ఈరోజు సాయంత్రం 4.59 గంటలకు ఉస్తాద్ భగత్ సింగ్‌ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తామని తెలియజేస్తూ, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పవన్‌ కళ్యాణ్‌ నడిచివస్తున్న ఓ ఫోటోని విడుదల చేసింది. దానిలో ఆయన బూట్ల క్రింద ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ టైటిల్ వేశారు. ఆ పోస్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ మోకాలి దిగువ భాగం నుంచే చూపారు కనుక ఆ పోస్టర్‌ డిజైన్ చేసినవారు అందరికీ కనబడేలా ఉండేందుకు సినిమా టైటిల్‌ను పోస్టర్‌ దిగువభాగంలో వేశారని అర్దమవుతూనే ఉంది. దానినే పూనమ్ కౌర్ తప్పు పట్టారు. కానీ అంతకు ముందు విడుదల చేసిన వేరే పోస్టరులో పవన్‌ కళ్యాణ్‌ తల వెనుక టైటిల్ వేశారు. ఇది కేవలం పోస్టర్‌ డిజైనింగ్ కోసం చేసిందే తప్ప ఎవరినీ అవమానించడానికి కాదని అర్దమవుతూనే ఉంది. అయినా పవన్‌ కళ్యాణ్‌ దేశభక్తి గురించి అందరికీ తెలిసిందే. ఆయన తెలిసి తెలిసి స్వాతంత్ర సమరయోధులనే కాదు తన శత్రువులను కూడా అవమానించారని అందరికీ తెలిసిందే.