నరేష్‌, పవిత్రా లోకేష్‌ ‘మళ్ళీ పెళ్ళి’ వాళ్ళ కధే!

నరేష్‌, పవిత్రా లోకేష్‌ మద్య రిలేషన్‌షిప్ ఇప్పుడు రహస్యమేమి కాదు. అందరికీ తెలిసిందే. ఒకవేళ వారి అఫైర్ గురించి లోకంలో ఇంకెవరికైనా తెలిసి ఉండకపోతే వారికి కూడా సవివరంగా తెలియజేసేందుకే “మళ్ళీ పెళ్ళి” పేరుతో ఇద్దరూ కలిసి ఓ సినిమా చేశారు. దాని ట్రైలర్‌లో నేడు విడుదలైంది. ఆ ట్రైలర్‌లో సూపర్ స్టార్ కృష్ణ పరువు, ఆయన కుటుంబం పరువు కూడా తీసేసిన్నట్లు అర్దమవుతోంది. అలాగే నరేష్‌ భార్యలు, గొడవలు, విడాకులు, పవిత్రా లోకేష్‌ పెళ్ళిళ్ళు, విడాకులు, నరేష్‌తో ప్రేమాయణం, ఆస్తుల గొడవలు, బెంగళూరులో ఓ హోటల్‌ గదిలో ఇద్దరూ ఎంజాయ్ చేస్తుండగా నరేష్‌ రెండో భార్య వచ్చి వారిని రెడ్ హ్యాండడ్‌గా పట్టుకోవడం వంటి సన్నివేశాలను కూడా ఇద్దరూ ఏమాత్రం మొహమాటపడకుండా తమ సినిమాలో చూపిస్తున్నారు. తమ జీవితాలు, పెళ్ళిళ్ళు, గొడవలనే కధాంశంగా తీసుకొని సినిమా చేయడం చాలా ఆశ్చర్యకరమైన విషయమే. కనుక వాళ్ళిద్దరి కధ ఎలా సాగిందో తెలుసుకొనేందుకైనా ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కట్టడం ఖాయమే అనిపిస్తుంది ట్రైలర్‌ చూస్తే. 

ఇక ఈ సినిమాలో నరేష్‌, పవిత్రా లోకేష్‌, అన్నపూర్ణ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఎంఎస్.రాజు కధ, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విజయ కృష్ణా బ్యానర్‌పై నరేష్‌ స్వయంగా నిర్మించారు. ఈ సినిమా మే 26న విడుదల కాబోతోంది.