మొయిద్దీన్ భాయ్ లాల్ సలాం... ముస్లిం వేషధారణలో రజనీకాంత్‌

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధానపాత్రలలో లాల్ సలాం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. దానిలో రజనీకాంత్‌ ఓ అతిధిపాత్ర చేస్తున్నారు. ఆ పాత్ర పేరు ‘మొయిద్దీన్ భాయ్’ అని పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్స్ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. దానిలో రజనీకాంత్‌ ఎర్రటి టోపీ, నల్ల గాగుల్స్, షేర్వాణీ ధరించారు. అంటే ఈ సినిమాలో రజనీకాంత్‌ ముస్లింగా నటించబోతున్నట్లు స్పష్టమైంది. బ్యాక్ గ్రౌండ్‌లో ముంబైలోని ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ ముంబైలో జరిగిన హిందూ, ముస్లిం గొడవలను పోస్టర్‌లో చూపించడంతో ఇది కాస్త సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ సాగే సినిమా అని అర్దమవుతోంది. అయితే రజనీని పరిచయం చేసే ఈ పోస్టర్‌ అంత గొప్పగా డిజైన్ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడేళ్ళ విరామం తర్వాత ఐశ్వర్య మళ్ళీ ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాని బారీ బడ్జెట్‌లో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఇప్పటికే 50 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయిన్నట్లు సమాచారం. కనుక మరో 2-3 నెలల్లో సినిమా షూటింగ్‌ పూర్తయితే, దసరా, దీపావళి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.