
మన తెలుగు సినీ పరిశ్రమలోఇమేజ్ చట్రంలో చిక్కుకుపోయిన పెద్ద హీరోలు, దర్శకులు భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి హిట్ కొట్టేందుకు అపసోపాలు పడుతుంటే, యువహీరోలు, యువదర్శకులు విలక్షణమైన కధాంశాలతో చకచకా సినిమాలు చేసేస్తూ హిట్స్ కొడుతున్నారు.
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరం తేజ్, సంయుక్తా మేనన్ జంటగా నటించిన విరూపాక్ష సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అటువంటి కధాంశంతోనే విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్, కావ్యా థాపర్ జంటగా నటిస్తున్న ‘ఊరి పేరు భైరవకోన’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. నిన్న ఆదివారం సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.
శ్రీకృష్ణదేవరాయల కాలంలోని గరుడపురాణంలో నాలుగు పేజీలు అదృశ్యమయ్యాయని, ఆ నాలుగు పేజీల కధే ఈ భైరవకోన అంటూ చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టి, ఈ ఊర్లోనికి రావడమే కానీ బయటకుపోయే దారే లేదంటూ దర్శకుడు ప్రేక్షకులలో ఆసక్తి పెంచారు. కనుక ఇది కూడా విరూపాక్ష సినిమాలాగ హిట్ అవడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, వివా హర్ష తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాజ్ తోట, ఎడిటింగ్: చోట కె ప్రసాద్ చేస్తున్నారు.