తమిళ సినీరంగంలో పేరు మోసిన హాస్యనటుడు, దర్శకుడు మనోబాల (69) బుదవారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కన్నుమూశారు. గత కొంతకాలం జీర్ణకోశ (లివర్) సమస్యతో ఆయన బాధపడుతూ చికిత్స తీసుకొంటున్నారు. మనోబాల 1970లో తమిళ సినీపరిశ్రమలో ప్రవేశించారు. 1979లో భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేశారు. 1982లో దర్శకుడిగా మారారు. మనోబాల దర్శకుడిగా 24 సినిమాలు, నిర్మాతగా మూడు సినిమాలు చేశారు. తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగుతో సహా ఆయన మొత్తం 450కి పైగా సినిమాలలో నటించారు.
ఒక్కో సంవత్సరంలో 20-27 సినిమాలు చేసేవారంటే మనోబాలకు ఎంత డిమాండ్ ఉందో అర్దం చేసుకోవచ్చు. తెలుగులో చిరంజీవి, శ్రుతీ హాసన్ జంటగా చేసిన వాల్తేర్ వీరయ్య సినిమాలో మనోబాల జడ్జీగా నటించి చక్కటి కామెడీతో అలరించారు. తమిళ సినిమాలలో మనోబాల హాస్యనటుడిగా తనదైన ముద్రవేశారు. ఆయన మృతిపట్ల తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.