
అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన యాక్షన్ మూవీ ఏజంట్ ఏప్రిల్ 28న విడుదలై మొదటిరోజునే నెగెటివ్ టాక్ సంపాదించుకోవడంతో అప్పుడే సినిమాను థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. సుమారు రూ.80-90 కోట్ల బారీ బడ్జెట్‌తో నిర్మించిన ఏజంట్ సినిమా ఇంత దారుణంగా ఫ్లాప్ అవడంతో అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్ పడింది. దీంతో దర్శకుడు సురేంద్ర రెడ్డికి కూడా ఇండస్ట్రీలో చెడ్డపేరు వచ్చింది.
కానీ అందరి కంటే ఎక్కువ నష్టపోయినవారు మాత్రం ఈ సినిమా నిర్మాతలే. సినిమా ఇంత దారుణంగా ఫ్లాప్ అవడంపై నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర స్పందిస్తూ, “ఈ పరాజయానికి మేము పూర్తి బాధ్యత స్వీకరిస్తున్నాము. ఇలాంటి యాక్షన్ సినిమా చేయడం చాలా కష్టమని తెలిసి ఉన్నప్పటికీ చేయగలమనే నమ్మకంతో ముందుకుసాగి దెబ్బ తిన్నాము. బౌండ్ స్క్రిప్ట్ కూడా లేకుండా సినిమా మొదలుపెట్టడం, మద్యలో కరోనా, ఇంకా అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ ముందుకు సాగినా సినిమా పోయింది. ఇందుకు మేము ఎటువంటి సాకులు చెప్పి తప్పించుకోవాలనుకోవడం లేదు. ఖరీదైన ఈ ప్రయోగం నుంచి పాఠాలు నేర్చుకొని మళ్ళీ ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాము. మాపై నమ్మకం ఉంచిన వారందరినీ నిరాశ పరిచినందుకు క్షమాపణలు చెపుతున్నాము. భవిష్యత్‌లో తీయబోయే సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొంటూ ఈ నష్టాన్ని భర్తీ చేసుకొనేందుకు ప్రయత్నిస్తాము,” అంటూ ట్వీట్ చేశారు.
సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఏజంట్ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామభద్రం సుంకర, అజయ్ సుంకర, పతి దీపారెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు కధ వక్కంతం వంశీ, స్టంట్స్: విజయ్ మాస్టర్, స్టంట్ శివ, అందించారు.