యశోద, శకుంతల వంటి భిన్నమైన పాత్రలు చేసి అందరినీ మెప్పిస్తున్న నటి సమంత మయోసైటీస్ అనే కండరాల బలహీన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూర్తిగా కోలుకొని సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది కూడా. అయితే మళ్ళీ హటాత్తుగా మొహానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొన్న ఫోటోను తన ఇంస్టాలో పోస్ట్ చేయడంతో ఆమెకు ఏమైందో అని బంధుమిత్రులు, అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇది కేవలం హైపర్ బారిక్ అనే ఆక్సిజన్ ధెరపీ మాత్రమే.
ఈ ధెరపీలో కాస్త అధిక ఒత్తిడితో స్వచ్చమైన ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులలోకి పంపిస్తారు. తద్వారా వాటిలో ఇన్ఫెక్షన్ కలుగజేసే హానికారక బాక్టీరియా ఉంటే నశించిపోతుంది. దాంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా పనిచేస్తాయి. స్వచ్చమైన ఆక్సిజన్ అందుతుంటే ఎర్రరక్తకణాలు దానిని స్వీకరించి శరీరావయవాలకు అందజేస్తుంటాయి కనుక శరీరంలో నరాలు, కండరాలు, ఎముకలు అన్నీ ఆరోగ్యంగా, బలంగా ఉంటూ ఇన్ఫెక్షన్స్ తట్టుకొనేవిదంగా తయారవుతాయి.
సమంత సినిమాలు, వెబ్ సిరీస్ కోసం చాలా శారీరికశ్రమ చేయాల్సి ఉంటుంది కనుక అందంగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యంగా ఉండటం కూడా చాలా అవసరం. అందుకే వైద్యుల సలహా మేరకు ఈ హైపర్ బారిక్ అనే ఆక్సిజన్ ధెరపీని తీసుకొంటోంది. ఇది ఆమె ఆరోగ్యం మరింత మెరుగుపడటం కోసం చాలా ఉపయోగపడుతుంది కనుక ఆక్సిజన్ మాస్క్ చూసి ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని వైద్య నిపుణులు చెపుతున్నారు. కనుక సమంత అభిమానులు ఆమెకు మరింత ఆరోగ్యంగా ఉంటూ మంచి మంచి సినిమాలు చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు.