
మాస్ మహరాజ్ రవితేజ నటించిన రావణాసుర సినిమా ఈ నెల 7న థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రిస్క్ తీసుకొని తొలిసారిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన రవితేజకు నిరాశే మిగిలింది. ఒకప్పుడు ఓటీటీలు లేనికాలంలో ఏ సినిమా అయినా థియేటర్ల ఆడకపోతే వాటిని ప్రదర్శించేందుకు మరో అవకాశం లేకపోవడంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతుండేవారు. కానీ ఓటీటీలు వచ్చిన తర్వాత నిర్మాతలకి మరో చిన్న అవకాశం లభిస్తోంది. రావణాసుర సినిమా కూడా మే 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రావణాసుర క్రైమ్ థ్రిల్లర్ మూవీలో రవితేజ, అనూ ఎమ్మాన్యుయేల్, ఫారియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాని అభిషేక్ నామతో కలిసి రవితేజ తమ రవితేజ టీమ్ వర్క్స్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు.
ఈ సినిమాకి కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీంస్ శిశిరోలియో, ఫోటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఆర్ట్: డిఆర్కె కిరణ్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.