మంగళవారంనాడు పాయల్ ప్రదర్శన... ఏం చేయబోతోందో?

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పాయల్ రాజ్‌పుత్ పరిచయం అయ్యింది. ఆ సినిమా దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఆమె ప్రధానపాత్రలో ‘మంగళవారం’ అనే సినిమా చేస్తోంది. ఆ సినిమా ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ ఈరోజు విడుదల చేశారు. దానిలో ఆమె నగ్నంగా ఉన్నట్లు చూపారు. అయితే ఆమె కళ్ళలో కనీళ్ళు ఉబికివస్తుంటే వెనక్కు తిరిగి చూస్తుండగా వేలిపై సీతాకోకచిలుక వాలిన్నట్లు దర్శకుడు చూపారు. తద్వారా అందమైన సీతాకోకచిలుక వంటి ఆమె లైంగికవేధింపులను ఎదుర్కొంటున్నట్లు తెలియజేశారనుకోవచ్చు. 

ఈ సందర్భంగా అజయ్ భూపతి ఈ సినిమా గురించి మీడియా ప్రతినిధులకు వివరిస్తూ, “1990వ దశకంలో గ్రామీణ నేపధ్యంతో ఈ కధ సాగుతుంది. అయితే ఇది మన నేటివిటీతో సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉన్నాయి. ప్రతీపాత్ర కధతో బలంగా రిలేట్ అయ్యుంటుంది. వాటిలో హీరోయిన్‌ పాత్ర పేరు శైలజ. ఆర్ఎక్స్ 100 సినిమాలాగే ‘మంగళవారం’ సినిమాలో శైలజ పాత్రని ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఈ సినిమా ఎక్కువ శాతం రాత్రిపూటే షూట్ చేశాము. గత మూడు నెలల్లో నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నాము. మే నెలలో ఆఖరి షెడ్యూల్ షూటింగ్‌ పూర్తి చేస్తాము,” అని తెలిపారు. 

దక్షిణాది నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వంతోపాటు నిర్మాతలలో ఒకరిగా ఉన్నారు. ఈ సినిమాను అజయ్ భూపతి కొత్తగా స్థాపించిన తన సొంత నిర్మాణ సంస్థ ‘ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మలతో కలిసి నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ సినిమా కాంతారకు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.