.jpg)
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతీ సనన్ సీతారాములుగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా నుంచి ఈరోజు “మహిమాన్విత మంత్రం నీ నామమే... జై శ్రీరామ్... జై శ్రీరామ్... రాజారాం...” అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటను అజయ్-అతుల్ స్వరపరచగా, రెండు బృందాలు కోరస్ పాడాయి.
రామజోగయ్య వ్రాసిన పాటలో తప్పులు పట్టలేము. అలాగే అజయ్-అతుల్ పాటకు సంగీతం అద్భుతంగా ఇచ్చారు. కానీ ఈ తెలుగు పాట హిందీ అనువాదం పాటలా వినిపిస్తుండటమే కాస్త ఇబ్బందిగా ఉంది. ఈ సినిమా టీజర్, పోస్టర్, పాత్రల వేషధారణపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ చిత్రబృందం వాటిని సరిచేసుకొంటున్నట్లు లేదని ఈ తాజా పాటతో మరోసారి స్పష్టం అవుతోంది.
రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో వివిద భాషలలో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నప్పుడు, ఆయా భాషలలో పాటలు, డైలాగ్స్ అన్నిటిలో నూటికి నూరు శాతం నేటివిటీ ఉండాలి కదా?ఇదేమీ డబ్బింగ్ సినిమా కాదు కదా? రేపు ఇదే కారణంగా ప్రేక్షకులు సినిమాని తిరస్కరిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
ఇంతవరకు వచ్చిన పోస్టర్స్, టీజర్ వగైరాలను బట్టి చూస్తే శ్రీరాముడు సీత కోసం లంకకు బయలుదేరడంతో దర్శకుడు ఈ కధ మొదలుపెట్టిన్నట్లు అర్దమవుతుంది. కనుక రామరావణ యుద్ధం ఈ సినిమాలో హైలైట్ అని భావించవచ్చు. నిజానికి రామాయణంలో ఎక్కడి నుంచి కధ తీసుకొన్నా సరిగ్గా చెప్పగలిగితే చాలా శ్రావ్యంగానే ఉంటుంది. మరి దర్శకుడు ఓం రౌత్ ఏమేరకు సఫలం అవుతాడో 2023, జూన్ 16న సినిమా విడుదలైనప్పుడు తెలుస్తుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు.