అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా పుష్ప-1కి సీక్వెల్‌గా తీస్తున్న పుష్ప-2 కోసం సుకుమార్ బృందం ఒడిశాలోని దట్టమైన మల్కన్‌గిరి అడవుల్లో మకాం వేసింది. పుష్ప-1 సినిమాని ఏపీలో మారేడుమిల్లి అడవుల్లో తీశారు. ఇప్పుడు మరింత లోనికి వెళ్ళి ఒడిశాలోని మల్కన్‌గిరి అడవుల్లో తీస్తున్నారు. దర్శకుడు సుకుమార్, ఫోటోగ్రఫర్ మీరొస్లా కుబా బ్రోజెక్, యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ మేనేజర్ పి.వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ తదితరులతో కలిసి అల్లు అర్జున్ షూటింగ్‌లో పాల్గొనేందుకు మల్కన్‌గిరి అడవుల్లోకి వెళ్ళాడు.
అందరూ కలిసి లొకేషన్‌కు వెళుతుండగా స్థానికులు ఎవరో అల్లు అర్జున్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుబురు గడ్డం, జుట్టుతో నల్లటి దుస్తులు ధరించి కనబడ్డాడు. మరో ఫోటోలో షార్ట్స్ వేసుకొని కనవడ్డాడు. వారందరూ అక్కడి సప్తధార, చిత్రకొండ, హ్యాంగింగ్ బ్రిడ్జ్ తదితర ప్రాంతాలలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు షూటింగ్ చేయబోతున్నారు. అక్కడ వారం పది రోజులు షూటింగ్ చేయవచ్చని తెలుస్తోంది.
దీనిలో కూడా ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో పాటు ఈసారి జగపతి బాబు కూడా నటిస్తున్నారు.
పుష్ప-2 సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్ అందిస్తున్నారు. పుష్ప-2 ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2024 సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.