
హైదరాబాద్లో మళ్ళీ ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్, దాని అధినేతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, ఇంకా పుష్ప దర్శకుడు సుకుమార్ ఇళ్ళు, కార్యాలయాలపై బుదవారం ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఫిలిమ్ నగర్ తదితర ప్రాంతాలలో గల వారి ఇళ్ళు, కార్యాలయాలలో ఐటి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించి, వారి ఆర్ధిక లావాదేవీలకు సంబందించిన అగ్రిమెంట్లు, బ్యాంక్ డాక్యుమెంట్లు, ఇంకా స్తిర, చరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్లు తెలుస్తోంది. వారి ఇళ్ళలో నగదు, బంగారు ఆభరణాలను కూడా లెక్కిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒకేసారి ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద హీరోలైన నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డి, చిరంజీవితో వాల్తేర్ వీరయ్య సినిమాలను చాలా భారీ బడ్జెట్తో నిర్మించి జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల చేసింది. రెండూ హిట్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు మరోపక్క డిస్ట్రిబ్యూషన్ సంస్థలను కూడా నిర్వహిస్తున్నారు.
దర్శకుడు సుకుమార్ కెరీర్ ‘రంగస్థలం’ సినిమా నుంచే పీక్ స్థాయికి చేరుకొంది. అల్లు అర్జున్తో చేసిన పుష్ప-1 సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆయన మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలో భాగస్వామిగా కూడా మారి మరింత ఎత్తుకు ఎదిగిపోయారు. ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-2 తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడులు జరుగుతున్న సమయంలో సుకుమార్ పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కనుక ఆయన లేకుండానే ఐటి అధికారులు ఆయన కుటుంబ సభ్యులు, ప్రతినిధుల సమక్షంలో సోదాలు నిర్వహిస్తున్నారు.