ఎన్టీఆర్‌ సినిమాలో రావణాసురుడు ప్రవేశం

ఆదిపురుష్‌ సినిమాలో రావణాసురుడిగా నటించిన బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీఖాన్ ఎన్టీఆర్‌-కొరటాల శివ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు నేడు సైఫ్ ఆలీఖాన్ ముంబై నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ట్విట్టర్‌లో ఈ విషయం తెలియజేస్తూ, జాతీయ అవార్డు గ్రహీత సైఫ్ ఆలీఖాన్ ఈ హైవోల్టేజి యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్‌లో చేరేందుకు వచ్చిన టీమ్‌ ఎన్టీఆర్‌30 సైఫ్ ఆలీఖాన్‌కు స్వాగతం,” అంటూ ఎన్టీఆర్‌, కొరటాల, సైఫ్ ఆలీఖాన్‌ల ఫోటోలు ఎన్టీఆర్‌ అభిమానులతో షేర్ చేసింది.  

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ పూర్తయింది. హైదరాబాద్‌లోనే రెండో షెడ్యూల్ షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా అలనాటి మేటి అందాల నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆమెకు తొలి తెలుగు సినిమాలోనే ఎన్టీఆర్‌ వంటి గొప్ప నటుడికి జోడీగా నటించే అవకాశం లభించడం గొప్ప విషయమే. 

ఎన్టీఆర్‌ 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి కొంతమంది సాంకేతిక నిపుణులను తీసుకువస్తున్నారు. ఈ సినిమా 2024, ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది.