సుజీత్ సినిమా కోసం పవన్‌ కళ్యాణ్‌ ఛలో ముంబై!

ఇటు సినిమాలలో, అటు జనసేన పార్టీతో రాజకీయాలలో క్షణం తీరికలేకుండా ఉన్న పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేయబోతోంది. కనుక ఎన్నికల గంట మ్రోగేలోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటితో వచ్చే ఆదాయం పార్టీ నిర్వహణకు చాలా అవసరం కనుక మిగిలిన ఈ కొద్దిపాటి సమయంలో పవన్‌ కళ్యాణ్‌ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్దం అవుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, పవన్‌ కళ్యాణ్‌ సుజీత్ దర్శకత్వంలో ఓజీ పేరుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినందున దానిని ప్రారంభించేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఓజీ అంటే ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే టైటిల్‌ను నిర్మాత ఫిలిమ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. 

ఈ సినిమా షూటింగ్‌ మొన్ననే ముంబైలో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్ ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్ పేరుతో చిన్న వీడియో విడుదల చేశారు. అది చూస్తే ఇది కూడా సాహో లాగే సుజీత్ మార్క్ యాక్షన్ మూవీ అని అర్దమవుతుంది. ముందుగా పవన్‌ కళ్యాణ్‌ చేయాల్సిన సన్నివేశాలన్నిటినీ పూర్తిచేసిన తర్వాత మిగిలినవారితో సినిమా షూటింగ్‌ పూర్తి చేసేలా దర్శకుడు సుజీత్ ప్లాన్ చేసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో పవన్‌ కళ్యాణ్‌ కూడా ముంబై వెళ్ళి నెలాఖరువరకు ఓజీ షూటింగ్‌లో పాల్గొంటారు. 

ఈ సినిమాకి సంగీతం: తమన్, కెమెరా: వజీద్ బేగ్ అందిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే హరిహరవీరమల్లు, వినోదాయ సీతం (తెలుగు రీమేక్) పూర్తి చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా కూడా మొదలుపెట్టారు.