పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా ప్రధానపాత్రలో వచ్చిన వకీల్ సాబ్‌కు విడుదలై ఏప్రిల్ 9కి రెండేళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగించే శుభవార్త చెప్పారు. అదే... సూపర్ హిట్ అయిన వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ సిద్దం అవుతోందని. ప్రస్తుతం అది ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉందని వేణు శ్రీరామ్ చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలు తెలియజేస్తానని వేణు శ్రీరామ్ అభిమానులకు హామీ ఇచ్చారు.
హిందీలో పింక్ సినిమాకు తెలుగు రీమేక్‌గా వకీల్ సాబ్ చేయడం సాధారణమైన విషయమే కానీ హిందీలో అమితాబ్ బచ్చన్ వంటి సీనియర్ నటుడు చేసిన ఆ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ అంతే గొప్పగా చేసి మెప్పించడం చాలా విశేషం. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా సిద్దం చేస్తున్నారు. కనుక ఈసారి ఈ సీక్వెల్‌ను హిందీలో రీమేక్ చేస్తారో లేక దీనినే పాన్ ఇండియా మూవీగా 5 భాషలలొ తీసి విడుదల చేస్తారో చూడాలి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహరవీరమల్లు, సముద్రఖని దర్శకత్వంలో తమిళ సినిమా ‘వినోదాయ సీతం’కు తెలుగు రీమేక్ పూర్తి చేసి, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు.