పుష్పరాజుకే షాకిచ్చిన లీకువీరులు!

రేపు అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులను ఆశ్చర్యపరుద్దామని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తే దానికే లీకువీరులు షాక్ ఇచ్చారు. పుష్ప-2లో అల్లు అర్జున్‌ చీర, జాకెట్ ధరించి, ముక్కు పుడక, చెవి దుద్దులతో, మెడలో పువ్వులు, నిమ్మకాయల దండలు ధరించి గ్రామదేవత వేషధారణలో ఉన్న పోస్టర్‌ను రేపు విడుదల చేద్దామనుకొన్నారు. కానీ లీకువీరులు ఆ పోస్టర్‌ను నేడే లీక్ చేసి సోషల్ మీడియాలో పెట్టేయడంతో దర్శకనిర్మాతలు షాక్ అయ్యారు. దీంతో ఇక చేసేదేమీ లేక ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఆ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పెట్టారు. 

గ్రామదేవత వేషంలో ఓ చేతిలో తుపాకి పట్టుకొని నిలబడ్డ అల్లు అర్జున్‌ని చూస్తే సినిమాలో పోలీసులను లేదా శత్రువుల నుంచి తప్పించుకొనేందుకు ఆ వేషంలో వచ్చి ఏదో భారీ యాక్షన్ సన్నివేశంలో పాల్గొన్నట్లుంది. 

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతి బాబు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలాయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.