ఉస్తాద్ ఊచకోత షురూ... పవన్‌ అభిమానులకు పండగే

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు ఓ శుభవార్త! ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ. రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా షూటింగ్ ప్రారంభమైందని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేశారు. పవన్‌ కళ్యాణ్‌ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించబోతునట్లు పోస్టర్‌తో స్పష్టమైంది. ఓ చేత్తో రివాల్వర్, మరో చేతిలో టీగ్లాసు పట్టుకొని కుర్చీలో కూర్చొని పోలీస్ స్టేషన్‌లో ఎదురుగా ఉన్న సర్ధార్ భగత్ సింగ్‌ చిత్రపఠాన్ని చూస్తున్నట్లు చూపారు. “ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు...” అంటూ పవన్‌ మార్క్ యాక్షన్ పుష్కలంగా ఉండబోతోందని సంకేతం ఇచ్చారు. 

ఈ పోస్టర్‌ చూడగానే పవన్‌-హరీష్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్‌ సినిమా కళ్ళ ముందు మెదులుతుంది. కానీ ఈ సినిమా అంతకు మించి ఉండబోతోంది. ఎందుకంటే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తేరి’కి రీమేక్.  

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే క్రిష్ జాగర్లమూడితో హరిహరవీరమల్లు, సముద్రఖనితో మరో సినిమా పూర్తిచేశారు. సుజీత్‌తో మరో సినిమా చేసేందుకు ఒప్పుకొన్నారు. ఇప్పుడు హరీష్ శంకర్‌తో ఈ సినిమా మొదలుపెట్టారు. 

హరిహరవీరమల్లు సినిమాది చారిత్రిక నేపద్యం కావడంతో అది అభిమానులకు మింగుడు పడటం కష్టమే. సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదాయ సీతాం’ తమిళ సినిమాకు తెలుగు రీమేక్‌. దీనిలో పవన్‌ కళ్యాణ్‌ దేవుడి పాత్రలో నటించారు. కనుక దీనిలో కూడా పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఆశించిన మసాలా ఉండదు. కనుక హరీష్ శంకర్ అందించబోయే ఈ సినిమా కోసం ఎదురుచూడక తప్పదు.