పుష్ప ఎక్కడ? ఈ ఫస్ట్ గ్లింప్స్ చూశారా?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా చేస్తున్న పుష్ప-2 సినిమా అప్‌డేట్స్ గురించి చాలారోజులుగా అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ్ళ “అసలు పుష్ప ఎక్కడ?” అంటూ ఫస్ట్ గ్లింప్స్ (చిన్న వీడియో) మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దానిలో తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకొన్న పుష్ప... అసలు పుష్ప ఎక్కడ? అంటూ టీవీ న్యూస్ రిపోర్ట్ చూపుతూ, పోలీసులు డౌన్‌ డౌన్‌ అంటూ ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకి వచ్చి వాహనాలు తగులబెడుతూ ఆందోళనలు చేస్తుంటే పోలీసులు వారిని అడ్డుకొంటున్నట్లు చూపారు. చివరిగా ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్ప ఎక్కడున్నాడో చెపుతామంటూ ముగించారు. అంటే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పుష్ప-2 నుంచి తాజా అప్‌డేట్ రాబోతోందన్న మాట! 

పుష్ప-1లో నటించిన ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో పాటు మరికొంతమంది నటీనటులను పుష్పా-2లో వస్తున్నారు. వారిలో జగపతి బాబు కూడా ఒకరు. ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. రెండో భాగంలో శ్రీవల్లి (రష్మిక మందన) చనిపోతుందని, ఆ తర్వాత గిరిజన యువతిగా సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చి అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేస్తుందనే ఊహాగానాలు వినిపించాయి కానీ తాను పుష్ప-2లో చేయడం లేదని సాయి పల్లవి స్వయంగా చెప్పింది. 

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. పుష్ప మొదటి భాగానికి అద్భుతమైన సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప-2కి ఇంకా అద్భుతమైన సంగీతం అందిస్తారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప2 ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2024 సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.