
జూ.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్లో నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ఓ చేపలుపట్టే జాలరి కూతురుగా నటించబోతున్నట్లు తాజా సమాచారం. జాన్వీ కపూర్ చేయబోయే తొలి తెలుగు సినిమాలోనే ఇటువంటి పాత్ర చేయించడం చాలా సాహసమే అని చెప్పాలి. ఆమె ఈ పాత్రలో మెప్పించగలిగితే శ్రీదేవికి తగ్గ కూతురు అని మంచి పేరు లభిస్తుంది. కానీ మెప్పించలేకపోతే ఆ ప్రభావం సినిమాపై కూడా పడుతుంది. ఆచార్యతో పెద్ద ఎదురుదెబ్బ తిని విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు కొరటాలకు ఇది అగ్నిపరీక్షే అని చెప్పవచ్చు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రవేశించేందుకు లభించిన ఈ గొప్ప అవకాశాన్ని చేజేతులా పాడుచేసుకొన్నట్లవుతుంది కూడా.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ కూడా ఓ ముఖ్యపాత్ర చేయబోతున్నట్లు తాజా సమాచారం. (ఓం దౌత్ దర్శకత్వంలో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ రావణుడిగా నటించాడు.) ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్ పాత్ర చాలా వీరోచితంగా ఉండబోతోంది కనుక దానికి తగ్గట్లుగానే జూ.ఎన్టీఆర్ పూర్తి డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
దీనిని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ పాన్ ఇండియా మూవీగా 5 భాషలలొ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా రత్నవేలు, సంగీతం అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ చేస్తున్నారు.