కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా ఎన్టీఆర్ 30వ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇదే విషయం అభిమానులకు తెలియజేస్తూ, జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో “వస్తున్నా...” అంటూ ఎన్టీఆర్ సెట్స్‌లోకి ప్రవేశిస్తున్న చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేశారు. వారం రోజుల క్రితమే హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దానికి ముంబై నుంచి జాన్వీ కపూర్ కూడా హాజరైంది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం, మొదటి సినిమా జూ.ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడుతో కలిసి నటించే అవకాశం లభించింది. గతంలో ఆమె తల్లి, అలనాటి అందాల నటి శ్రీదేవి ఎన్టీఆర్‌తో అనేక సినిమాలు నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందిస్తున్నారు.