అల్లు అర్జున్‌ 20 ఇయర్స్ ఇండస్ట్రీ!

సరిగ్గా 20 ఏళ్ళ క్రితం అల్లు అర్జున్‌ అంటే ఎవరో తెలుగు ప్రజలెవరికీ తెలీదు కానీ ఇప్పుడు తెలుగు ప్రజలతో పాటు దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల అభిమాన హీరో అయ్యాడు. 1985లో విడుదలైన విజేత సినిమాలో బాలనటుడిగా నటించిన అల్లు అర్జున్‌, 2001లో డాడీ సినిమాలో మరోసారి తళుక్కుమని మెరిశాడు. ఆ తర్వాత 2003లో విడుదలైన గంగోత్రి సినిమాతో హీరోగా తన సినీ ప్రయాణం ప్రారంభించాడు. అయితే ఆ సినిమా హిట్ అయినప్పటికీ అల్లు అర్జున్‌ రూపురేఖలపై చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ అదే అల్లు అర్జున్‌ నేడు స్టయిలిష్ స్టార్ అనే గౌరవం పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత దర్శకుడు సుకుమార్ ఆర్యతో అల్లు అర్జున్‌కి తొలి బ్రేక్ ఇచ్చారు. దర్శకుడు వివి వినాయక్ బన్నీతో మరో హిట్ ఇవ్వడంతో మరి అల్లు అర్జున్‌ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం కలగలేదు. మద్యలో హ్యాపీ, వరుడు వంటి కొన్ని ఫ్లాప్స్ పడినప్పటికీ, దేశముదురు, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, దువ్వాడ జగన్నాధం, అల వైకుంఠపురములో, పుష్ప వంటి సూపర్ హిట్ సినిమాలతో అల్లు అర్జున్‌ సక్సస్ రేట్ ఎక్కువగా ఉండటంతో తెలుగు సినీ పరిశ్రమలో నంబర్: 1 స్థాయికి ఎదిగిపోయాడు. 

సుకుమార్ దర్శకత్వంలో చేసిన పుష్పతో అల్లు అర్జున్‌ మరోస్థాయికి ఎదిగిపోయాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలోనే పుష్ప-2 సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్‌ సినిమా అంటే పక్కా సూపర్ హిట్, పాన్ ఇండియా మూవీ అని అనుకొనే స్థాయికి ఎదిగిపోయాడు. కానీ అల్లు అర్జున్‌ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ, వివాదాలకు దూరంగా ఇండస్ట్రీలో, అభిమానులలో మంచి పేరు సంపాదించుకొన్నాడు.