
మాస్ రాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమాతో ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నందున మంగళవారం ‘రావణాసుర’ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్దమవుతుంది. వాడు క్రిమినల్ లాయర్ కాదు... లా చదివిన క్రిమినల్ అంటూ జయరాం వాయిస్ ఓవర్‌తో వినిపించే డైలాగ్, మర్డర్ చేయడం క్రైమ్ దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్. ఐయామ్ యాన్ ఆర్టిస్ట్. నా ఆర్ట్ ను రెస్పెక్ట్ చెయ్ బేబీ,” అనే రవితేజ డైలాగ్ వింటే ఈ సినిమాలో రవితేజ పాత్ర ఏవిదంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. మాస్ రాజా రవితేజ అన్నాక అభిమానులు కామెడీ కూడా ఉంటుందని ఆశిస్తారు. అదీ పుష్కలంగా ఉందని ట్రైలర్లో స్పష్టం చేశారు. రవితేజ పోలీస్ ఆఫీసరుగా కొన్ని సినిమాలలో నటించాడు కానీ ఈ సినిమాలో తొలిసారిగా క్రిమినల్ లాయర్‌గా నటిస్తుండటంతో సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో రవితేజకు జోడీగా అనూ ఎమ్మాన్యుయేల్, ఫారియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ నామతో కలిసి రవితేజ, తమ రవితేజ టీమ్ వర్క్స్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి దర్శకత్వం: సుధీర్ వర్మ, కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీంస్ శిశిరోలియో, ఫోటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఆర్ట్: డిఆర్కె కిరణ్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.