కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ 30వ సినిమా నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జాన్వీ కపూర్ హైదరాబాద్ రాగా దర్శకుడు రాజమౌళి వారిద్దరిపై క్లాప్ కొట్టి లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు.
ఈ పూజా కార్యక్రమానికి రాజమౌళి, కొరటాల శివలతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్, ఈ సినిమా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేని, నందమూరి కళ్యాణ్ రామ్, టి-సిరీస్ అధినేత, ఈ సినిమా హిందీ వెర్షన్ నిర్మాత భూషణ్ కుమార్, ఇంకా అభిషేక్ అగర్వాల్, కెఎస్. రామారావు, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, నటులు శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఇంకా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. కనుక ఇకపై తరచూ తెలుగు, తమిళ్ సినిమాలలో నటించే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు.
ఈ సందర్భంగా ఈ సినిమా కధాంశం ఏమిటో దర్శకుడు కొరటాల క్లుప్తంగా చెప్పేశారు. జనతా గ్యారేజ్ తర్వాత సోదరుడు ఎన్టీఆర్‌తో ఈ సినిమా చేసే అదృష్టం మరోసారి లభించిచింది. కోస్టల్ ఇండియా బ్యాక్ డ్రాప్లో దీనిని తెరకెక్కించబోతున్నాము. మనుషులలో మృగాళ్ళకు భయం అంటే ఏమిటో తెలీదు. వీళ్ళకి దేవుదన్నా, చావన్నా భయం లేదు. కానీ వీళ్ళకి ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమే ఎన్టీఆర్. ఇలాంటి వాళ్ళని భయపెట్టడానికి హీరో ఏ స్థాయికి వెళతాడు?ఇదే ఈ సినిమా బ్యాక్ డ్రాప్. ఇదో ఎమ్మోషనల్ రైడ్. ఈ సినిమా మా అందరి కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.
జూ.ఎన్టీఆర్ 30వ చిత్రంగా రాబోతున్న దీనికి ఇంకా టైటిల్ ఖరారు చేయనందున #ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్‌తో పనులు మొదలుపెట్టారు. దీనిని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా కోసం నిర్మాత బండ్ల గణేశ్ రిజిస్టర్ చేసుకొన్న ‘దేవర’ టైటిల్ ఈ సినిమాకి ఇచ్చిన్నట్లు సమాచారం కానీ ఈ వార్తని ఖరారు చేయవలసి ఉంది.
ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందిస్తున్నారు.