నిఖిల్‌కు బాలీవుడ్‌లో గుర్తింపు... బెస్ట్ యాక్టర్ అవార్డ్

యువహీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా చేసిన కార్తికేయ-2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇదివరకు నిఖిల్ చేసిన కార్తికేయ-1తో సహా పలు సినిమాలు హిట్ అయ్యినప్పటికీ అతని కెరీర్‌లో ఇదే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా గత ఏడాది ఆగస్ట్ 13న రిలీజ్‌ చేయగా, భారత్‌తో పాటు విదేశాలలో కూడా సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా. 

ఇప్పుడు ఈ సినిమాకు బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డు ‘ఐకానిక్ గోల్డ్ అవార్డ్-2023 లభించింది. ఇటీవల ముంబైలో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో నిఖిల్ ‘బెస్ట్ యాక్టర్’ అవార్డు అందుకొన్నారు. ఆర్ఆర్ఆర్‌ సినిమా ఆస్కార్ అవార్డ్ అందుకోగా, నిఖిల్ నటించిన సినిమా బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకోవడం అందరికీ గర్వకారణమే. 

దీనిని పాన్ ఇండియా మూవీగా తీయాలని అనుకొన్నందున అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది ప్రజల సంస్కృతి, జీవనశైలిని చక్కగా  సినిమాలో జోడించి అందరూ చక్కగా కనెక్ట్ అయ్యే  కధాంశంతో తీయడం వలన సూపర్ హిట్ అయ్యిందని చెప్పవచ్చు.   

ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌, ఆదిత్య మీనమ్‌, కేఎస్‌ శ్రీధర్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు కాల భైరవ, కార్తీక్‌ ఘట్టమనేని అత్యద్భుతమైన సంగీతం, సినిమాటోగ్రఫీ అందించారు.