ఇంతకాలం ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ సాధించడం కోసం అమెరికాలో తమ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడిపిన రాజమౌళి, ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ సంబరాలలో తీరికలేకుండా ఉన్నారు. రాజమౌళితో సహా ఆయన బృందంలో అందరూ సమయం కేటాయిస్తే సన్మానాలు చేసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు. బహుశః మరో నెలరోజులైనా ఈ హడావుడి కొనసాగవచ్చు. ఆ తర్వాతే మహేష్ బాబుతో చేయబోయే తన తర్వాత సినిమా గురించి ఆలోచించేందుకు రాజమౌళికి సమయం లభిస్తుంది.
అయితే తాజాగా వారిద్దరూ మాట్లాడుకొంటున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మహేష్ బాబు ఏదో చెపుతుంటే రాజమౌళి శ్రద్దగా వింటున్నట్లుంది. ఫోటోలో రాజమౌళి గడ్డం చూస్తే తాజా ఫోటోలాగే కనిపిస్తోంది. రాజమౌళి శుక్రవారం ఉదయమే లాస్ ఏంజలీస్ నుంచి హైదరాబాద్ చేరుకొన్నారు. కనుక ఇంత త్వరగా వారిద్దరూ కలిసే అవకాశమే లేదు. మరి వారిద్దరూ ఎప్పుడు, ఎక్కడ కలిశారు?ఇది వారి తాజా ఫోటోయేనా లేక ఇదివరకు తీసిన ఫోటోనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇక రాజమౌళి-మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే, ఇండియానా జోన్స్ వంటి యాక్షన్ అండ్ అడ్వంచర్ సినిమాగా తీయబోతున్నామని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఈ సినిమాలో మహేష్ బాబుని ప్రపంచం చుట్టివచ్చే సాహసవీరుడిగా చూపబోతున్నానని, ఈ సినిమా కధ అనేక దేశాలలో జరుగుతుంది కనుక ఎక్కువగా విదేశాలలో షూటింగ్ చేస్తామని చెప్పారు. కనుక ఇది కూడా అంతర్జాతీయ స్థాయిలో విదేశీ నటీనటులతో తీయబోతున్నట్లు భావించవచ్చు.
ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఈ ఏడాది జూలైలోగా పూర్తవుతాయని, ఆ తర్వాత ఎప్పుడైనా షూటింగ్ ప్రారంభం కావచ్చని ఈ సినిమాకి కధ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ 3-4 నెలల క్రితం చెప్పారు. ఈలోగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మొదలుపెట్టిన సినిమాని మహేష్ బాబు పూర్తి చేయవలసి ఉంటుంది. అది పూర్తి చేసి జూలై-ఆగస్ట్ నెలల్లో రాజమౌలితో ఈ సినిమా ప్రారంభిస్తే, ఆయన పద్దతి ప్రకారం బహుశః 2026 లేదా 2027 వరకు షూటింగ్ జరుగవచ్చు. ఆ తర్వాతే ఈ సినిమా రిలీజ్ కావచ్చు. కనుక ఒకసారి ఈ సినిమాలో మహేష్ బాబు జాయిన్ అయితే మళ్ళీ అప్పటి వరకు మరో సినిమా చేయలేడు. సుమారు మూడు నాలుగేళ్ళు మహేష్ బాబు సినిమా ఉండదంటే ఆయన అభిమానులకు చాలా నిరాశ కలిగించే విషయమే. కానీ మహేష్ బాబుకి కూడా ఆస్కార్ కావాలనుకొంటే ఓపికపట్టక తప్పదు.