నా ఆదాయం రోజుకి రెండు కోట్లు: పవన్‌ కళ్యాణ్‌

మెగాపవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకొంటారో స్వయంగా చెప్పేశారు. నిన్న మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావసభలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, “నాకు ఎవరో రూ.1,000 కోట్లు ఇచ్చారని, నేను డబ్బుకి అమ్ముడుపోయిన ప్యాకేజీ స్టార్‌నని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ రూ.1000 కోట్లు ఎక్కడ ఉన్నాయా అని నేను రోజూ వెతుకొంటూనే ఉన్నాను కానీ ఇంతవరకు దొరకలేదు. 

నేను నా తాజా సినిమా కోసం 22 రోజులు కాల్షీట్స్ ఇచ్చాను. ఒక్కోరోజుకి రూ.2 కోట్లు చొప్పున 22 రోజులు పనిచేస్తే నాకు మొత్తం రూ.25 కోట్లు చేతికివస్తుంది. నా రేంజ్ ఇది. ఇంత డబ్బు ఆర్జిస్తున్న నేను వీలైతే మరొకరికి ఆర్ధిక సాయం చేస్తానే తప్ప ఎవరికీ అమ్ముడుపోయేవాడిని కాను,” అని అన్నారు. 

ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకు కూడా సమయం కేటాయించవలసి ఉన్నందున వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదాయ సీతం సినిమాను సముద్రఖని దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానిలో పవన్‌ కళ్యాణ్‌ పాత్రకు సంబందించి సన్నివేశాల షూటింగ్‌ను కేవలం 22 రోజులలో పూర్తిచేస్తానని సముద్రఖని హామీ ఇవ్వడంతో ఆ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఆ సినిమాకే రూ.25 కోట్లు పారితోషికం తీసుకొంటున్నానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఇంత ధైర్యంగా తమ పారితోషికం గురించి చెప్పుకోరు. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఏకంగా లక్షమంది పాల్గొన్న బహిరంగసభలో చెప్పేశారు. దటీజ్ పవన్‌ కళ్యాణ్‌!