నాటుకి ఆస్కార్.. అభినందనలు: తమ్మారెడ్డి

ఆర్ఆర్ఆర్‌ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ లభించినందుకు దేశవ్యాప్తంగా వివిద రంగాలకు చెందిన ప్రముఖులు రాజమౌళి బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. నాలుగైదు రోజుల క్రితం ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ, “ఆస్కార్ అవార్డు కోసం విమానాలలో తిరుగుతూ 80 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఆ డబ్బు నాకు ఇచ్చి ఉంటే ఓ 8-10 సినిమాలు తీసి మోహాన్న కొడతాను,” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 

నేడు ఆయనే నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ లభించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, “ఆ పాటకి అత్యద్భుతమైన సంగీతం అందించిన కీరవాణికి, చక్కటి తేట తెలుగు పదాలతో అంత మంచి పాట వ్రాసిన చంద్రబోస్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు సినిమాకి జాతీయ అవార్డు రావడమే కష్టమనుకొంటే ఏకంగా ఆస్కార్ అవార్డ్ సాధించారు. ఇది తెలుగు వారందరికీ, ఆలాగే ప్రతీ భారతీయుడికి ఈ ఆస్కార్ అవార్డు గర్వకారణంగా నిలుస్తుంది. తెలుగు సినిమా పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు.