జబర్దస్త్ షోతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్న వేణు, కొన్ని సినిమాలలో హాస్య నటుడుగా నటించారు. ఇప్పుడు బలగం అనే సినిమాతో దర్శకుడుగా తన సత్తా నిరూపించుకొన్నారు. సజంగా హాస్యనటుడైన వేణు తన ఇమేజ్‌కి భిన్నంగా కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలతో నిండిన సినిమాని తీసి అందరినీ మెప్పించడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి కూడా బలగం సినిమాని చూసి వేణుని అభినందించకుండా ఉండలేకపోయారు. భోళాశంకర్ సెట్స్‌కు వేణుని పిలిపించుకొని, “ఏంటయ్యా వేణు... ఇంత బాగా సినిమా తీసి మాకు షాకులు ఇస్తే ఎలా? సినిమాని చాలా నిజాయితీగా తీశావు. అద్భుతంగా ఉంది. సినిమాలో తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ఊరు అన్నిటినీ నీ సినిమాలో చాలా బాగా చూపించావు. దిల్‌రాజు వంటి కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నా ఇటువంటి మంచి సినిమా తీశావు,” గుడ్ జాబ్! కీపిట్ అప్,” అంటూ చిరంజీవి ప్రశంశలు కురిపిస్తూ వేణుకి శాలువా కప్పి గౌరవించారు.
వేణు సెట్స్‌లోకి రాగానే నేరుగా చిరంజీవి వద్దకు వచ్చి ఆయన పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకొన్నారు. తర్వాత ఈ వీడియోని ట్విట్టర్లో తన అభిమానులతో షేర్ చేసుకొంటూ, “ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు థాంక్యూ సో మచ్ సార్ నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణం నాకు ఇది నా బలగం విజయం రుణపడి ఉంటాను చిరంజీవి గారికి Thank you megastar,” అంటూ వేణు ట్వీట్ చేశారు.