పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు శుభవార్త!

మెగాస్టార్ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు ఓ శుభవార్త. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకొంది. కనుక 30 సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమాని ప్రారంభించేశారు. తమిళంలో ఆయన దర్శకత్వంలోనే నిర్మించిన వినోదాయ సీతం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దానిలో పవన్‌ కళ్యాణ్‌ పాత్ర పూర్తి చేసేందుకు కేవలం 30 రోజులు కాల్షీట్స్ ఇస్తే చాలని సముద్రఖని చెప్పడంతో వెంటనే పవన్‌ కళ్యాణ్‌ ఆ సినిమాని మొదలుపెట్టేశారు.

అది ముగిసేలోగా హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమాని ఏప్రిల్ 5వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించేందుకు పవన్‌ కళ్యాణ్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు. కనుక ఈ సినిమా కోసం ఆర్టిస్ట్‌ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు కెమెరా: ఆయనంకా బోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.