
సినీ పరిశ్రమలో నటీనటులు పెళ్ళిళ్ళు చేసుకోవడం విడిపోవడం మళ్ళీ మరొకరిని పెళ్ళిళ్ళు చేసుకోవడం కొత్తేమీకాదు. కానీ ఇప్పుడు ఓ నాలుగైదేళ్ళు సహజీవనం (కాపురం) చేసిన తర్వాత అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకొని, ఆ తర్వాత హనీమూన్‌కి కూడా వెళ్ళివస్తున్నారు. ఇప్పుడు ఇదో కొత్త ట్రెండ్ అని సరిపెట్టుకోవాలేమో?
మంచు విష్ణు, మౌనికలు కూడా వేర్వేరు వ్యక్తులను పెళ్ళి చేసుకొని విడిపోయిన తర్వాత వారిద్దరూ కొంతకాలం సహజీవనం చేసి ఇటీవలే పెళ్ళి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఆమెకు మొదటి భర్త ద్వారా కలిగిన కొడుకు కలిగాడు. ఆ పిల్లాడిని మంచు మనోజ్ తన కొడుకుగా స్వీకరించాడు. ప్రస్తుతం తమ కధ సుఖాంతమైందని మంచు మనోజ్ చెప్పాడు.
నయనతార విగ్నేష్ శివన్ కూడా 5-6 ఏళ్ళు సహజీవనం చేసిన తర్వాత మహాబలిపురంలో అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకొన్నారు. పెళ్ళైన 5 నెలలకే సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇద్దరు బిడ్డలకి తల్లితండ్రులయ్యి వివాదంలో చిక్కుకొని బయటపడ్డారు.
నరేష్, పవిత్రా లోకేష్‌ల రొమాన్స్ సినిమాలకు ఏమాత్రం తీసిపోలేదు. 2022, డిసెంబర్ 31న ఇద్దరూ ముద్దుపెట్టుకొంటూ వీడియో తీసుకొని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొత్త ఏడాదిలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నామని ప్రకటించారు. చెప్పిన్నట్లుగానే గురువారం మైసూరులో వివాహం చేసుకొని, తమ వివాహ వేడుక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, హనీమూన్‌కి దుబాయ్ వెళ్ళిన్నట్లు సమాచారం.
తెలుగు సినీ పరిశ్రమలో ఇంకా చాలామంది హీరోహీరోయిన్లు రెండు, మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నవారున్నారు. వారిలో చాలామంది బుద్ధిగా కాపురాలు చేసుకొంటుండగా కొందరు విడాకులు పుచ్చుకొన్నాకనే చాలా మనశాంతిగా ఉందంటున్నారు. ఏదిఏమైనప్పటికీ అందరూ సంతోషంగా జీవితం గడపడమే ముఖ్యం. కానీ ఈ కొత్త ట్రెండ్‌ని ఫాలో అవ్వొద్దు... జస్ట్ చూసి ఆనందిద్దాం!