ఆస్కార్ అవార్డ్ కోసం 80 కోట్లు ఖర్చు అవసరమా... ఏం కాదా?

ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్‌ సినిమాకు ఆస్కార్ అవార్డు సాధించడం కోసం దర్శకుడు రాజమౌళి రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బు తనకిస్తే ఓ 8 లేదా 10 సినిమాలు తీసి మోహాన్న కొడతానంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ నిప్పు రాజేశాయి. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్ర రావు ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “మిత్రుడు భరద్వాజ్‌కి, తెలుగు సినిమాకు, సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచవేదికలపై మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి.... అంతే కానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్‌ఫర్మేన్షన్ ఏమైనా ఉందా..? జేమ్స్ కామరూన్, స్పీల్ బర్గ్ వంటివారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశ్యమా?” అని ట్వీట్‌ చేశారు. 

అయితే తమ్మారెడ్డి భరద్వాజ వేరే ఉద్దేశ్యంతో అంటే అది మరోలా చేరిందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో పలువురు నిర్మాతలు సినిమాలు తీయడానికి అప్పులు చేస్తున్నారని, కానీ ఆర్ఆర్ఆర్‌ బృందం ప్లేన్ ఖర్చులకే రూ.80 కోట్లు ఖర్చు పెడుతోందని, అంత డబ్బు తన వద్ద ఉండి ఉంటే దాంతో ఓ పది సినిమాలు తీసుకొనేవాడినని తమ్మారెడ్డి అన్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నప్పటికీ అది వేరేలా వినబడుతోంది కనుక ఆయనకి ఇటువంటి విమర్శలు భరించకతప్పదు.