
అంతా ఆన్‌లైన్ అయిపోయిన ఈరోజుల్లో ప్రజలకు పుస్తకాలు కొని చదివే అలవాటు లేనేలేదని చెప్పాలి. ఇటువంటి తరుణంలో ఓ యువరచయిత లక్ష రూపాయలు అప్పు చేసి మరీ పుస్తకం అచ్చు వేయిస్తే అతని పరిస్థితి ఏమిటి? అనే విన్నూత్నమైన కధాంశంతో వచ్చిన సినిమాయే రైటర్ పద్మభూషణ్.
సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటించిన ఈ సినిమా ఫిభ్రవరి 2న థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకొంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఈ నెల 17వ తేదీ నుంచి జీ5లోకి వస్తోంది. కధాంశంలో చిన్న సందేశంతో పాటు మంచి కామెడీ, రొమాన్స్ కూడా ఇమిడిఉంది కనుక సినిమాకు మంచి మార్కులే పడ్డాయి.
షణ్ముఖ ప్రశాంత్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోహిణి, ఆశీష్ విద్యార్ధి, శ్రీ గౌరీప్రియ, గోపరాజు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఛాయ్-బిస్కట్ ఫిలిమ్స్, లహరి ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ ఈ సినిమాని నిర్మించారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందించారు.
గమ్మతైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో రైటర్ పద్మభూషణ్‌గా నటించిన సుహాస్‌ని టీవీ చానల్ కోసం ‘చిన్న బైట్’ ఇమ్మనమని ఓ వీడియో జర్నలిస్ట్ వెంటపడుతుంటే సుహాస్ విస్సుకొంటాడు. అయితే జీ5 ఓటీటీ కోసమని చెప్పడంతో “ఓ జీ5 కోసమా... ఆ మాట ముందే చెప్పొచ్చు కదా అంటూ హీరోయిన్‌తో కలిసి ఈ నెల 17వ తేదీన జీ5లో విడుదల కాబోతున్న రైటర్ పద్మభూషణ్ సినిమాని తప్పక చూడండి,” అని చెప్పడం వెరైటీగా ఉంది.