మహా... అప్పుడే ఎందుకీ దూకుడు?

యువ దర్శకుడు వెంకటేష్ మహా... కేరాఫ్ కంచరపాలెం ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపాయలతో మంచిపేరే సంపాదించుకొన్నాడు. కానీ వాటితో కంటే “వందల కోట్ల పెట్టుబడులతో, మాస్ మసాలా మూస చిత్రాలు కాలక్షేపం కోసం పనికొచ్చే పాప్ కార్న్ సినిమాలు మాత్రమే,” అంటూ చేసిన వ్యాఖ్యాలే హటాత్తుగా అతనిని ఇండస్ట్రీలో ఓ కొత్త విలన్‌గా మార్చేసాయి. ఆ వ్యాఖ్యలపై మండిపడుతున్న వీరాభిమానులు సోషల్ మీడియాలో వెంకటేష్ మహాను దారుణంగా ట్రోలింగ్ చేస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డాడు. 

ఆ ఒత్తిడికి తలొగ్గి అతను కాస్త వెనక్కు తగ్గి తాను చేసిన వ్యాఖ్యల వలన బాధపడుతున్న వారందరికీ క్షమాపణలు చెపుకొన్నాడు. కానీ ఈ సందర్భంగా అతను ఇచ్చిన వివరణ వారిని శాంతింపజేయకపోగా ఆ అగ్గి మరింత రాజేసిందని చెప్పవచ్చు. ఇంతకీ మహా ఏమన్నాడంటే, “నేను ఇండస్ట్రీలో ఏ వ్యక్తిని ఉద్దేశ్యించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. సినిమాలలో కల్పిత పాత్రలను ఉద్దేశ్యించి మాత్రమే చేశాను. కానీ కొందరు కల్పితపాత్ర కానీ నన్ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నిజానికి ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు. ఇండస్ట్రీలో చాలా మంది అనుకొంటున్న మాటలనే నేను చెప్పాను. అయితే అవి తప్పుగా ఇతరులకు చేరాయి. 

ఆ కల్పిత పాత్రల తీరుతెన్నుల గురించి నేను చెప్పిన మాటలు ఎవరినో నొప్పించి ఉండవచ్చు అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. అయితే కానీ వాటిపై నా అభిప్రాయం మాత్రం అదే,” అంటూ సోషల్ మీడియాలో మరో వీడియో సందేశం పెట్టాడు మహా. 

చాలామందికి తెలిసిన చాలా విషయాలను ఎవరూ ఇలా బహిరంగంగా మాట్లాడరు. మాట్లాడితే వారిని వేటాడేందుకు సోషల్ మీడియా ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది! మన తెలుగు సినీ పరిశ్రమలో డాక్టర్ రాజశేఖర్, మంచు మోహన్ బాబు వంటి అనేకమంది కూడా బాధితులే. దానికి వారు, వారి వారసులు నేటికీ ఇంకా మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు. 

కనుక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తళుక్కుమని మెరుస్తున్న వెంకటేష్ మహా పంతానికి, బేషజానికి పోయి తన కెరీర్‌ను మొదలుపెట్టక ముందే నాశనం కాకూడదనుకొంటే మౌనం వహించడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ వలననే ఆయనకు ఈ గుర్తింపు వచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ మొసళ్ళ చెరువులోనే తెలివిగా తప్పించుకొంటూ జీవించాల్సి ఉంటుందని గ్రహించాలి. కనుక తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పగలిగే రోజువరకు పాప్ కార్న్ సినిమాలు చూసుకొంటూ ఎదురుచూడటం మంచిది.